పురపాలక తరహా మేలు – తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జక్కా వెంకట్‌రెడ్డి

పురపాలక తరహా మేలు – తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జక్కా వెంకట్‌రెడ్డి

ప్రస్తుతం రెవెన్యూ విభాగంలో ఆన్‌లైన్ విధానం లేకపోవడం సమస్యలకు ప్రధాన కారణమని, మునిసిపల్ కార్పొరేషన్లలో మాదిరి అమలుపరిస్తే పారదర్శకత.. జవాబుదారీతనం పెంపొందుతుందని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జక్కా వెంకట్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. అప్పుడు ఫైళ్లు ఏ స్థాయిలో ఎక్కడ ఎంతకాలం ఉంటున్నాయనేది గమనించవచ్చని, అలా ట్రాక్ చేయడం ద్వారా సకాలంలో ప్రక్రియ ముగిసిపోతుందని చెప్పారు. ప్రజలకు సౌలభ్యంగా చేయాల్సిన పనుల్లో విపరీత జాప్యం, అవినీతి, అక్రమాలు చోటుచేసుకుంటుండటం సరికాదని ఆయన అన్నారు. ఆన్‌లైన్ విధానం అమలువల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..

ఫైలును ట్రాక్ చేసే అవకాశం..

జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలలో ఎవరైనా ఒక అపార్టుమెంట్ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే.. సదరు అప్లికేషన్‌ను అధికారులందరూ సులువుగా ఆన్‌లైన్‌లో ట్రాక్ చేయవచ్చు. ఫైలు ఏ స్థాయిలో ఉంది? ఏ అధికారి వద్ద నిలిచిపోయిందో తెలుస్తుంది. ఎంతకాలం నుంచి ఫైలును పరిష్కరించలేదో అర్థమవుతుంది. ఒక ఫైలు అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ నుంచి ప్లానింగ్ ఆఫీసర్, అక్కడ్నుంచి డైరెక్టర్, ఆ తర్వాత హెచ్‌ఎండీఏ కమిషనర్ వద్దకు వెళ్లే విధానం స్పష్టంగా తెలిసిపోతుంది. కానీ, ఈ విధానం రెవెన్యూ విభాగంలో అమల్లో లేదు. ఇక్కడ ఫైళ్ల వ్యవస్థ మొత్తం పాత పద్ధతుల్లోనే.. ఫైళ్ల కదలిక మ్యానువల్‌గానే కొనసాగుతుంటుంది. ఒక్కో ఫైలు విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్వో) నుంచి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ), అక్కడ్నుంచి తహసీల్దార్ వద్దకు వెళుతుంది. అటునుంచి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో), అక్కడ్నుంచి జాయింట్ కలెక్టర్, చివరికి కలెక్టర్ వద్దకు చేరుతుంది. ఆన్‌లైన్‌లో ఫైళ్ల ట్రాకింగ్ ఉండనే ఉండదు. జిల్లా రెవెన్యూ అధికారి అయిన కలెక్టర్ సైతం ఏ ఫైలు ఏ స్థాయిలో ఉందో తెలుసుకోలేరు. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీకి సైతం నెలకు ఎన్ని ఫైళ్లు పరిష్కారమవుతున్నాయో తెలియదు. ఒక పనికోసం దరఖాస్తు చేస్తే.. నెలలో పూర్తికావొచ్చు. లేదా పదినెలలైనా పట్టొచ్చు. ఆన్‌లైన్ వ్యవస్థ కలెక్టర్ ఆఫీసుకు అనుసంధానంగా ఉండాలి. కానీ, అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో కనిపించడంలేదు. స్థలం సర్వేకోసం దరఖాస్తు చేస్తే.. సర్వేయర్ ఎప్పుడొస్తాడో ఎవరికీ తెలియదు. ప్రజలకు ఏయే సేవలు ఎన్ని రోజుల్లోపు అందుతాయనే విషయం తెలియదు.

మ్యుటేషన్ కోసం ముప్పుతిప్పలు..

మ్యుటేషన్ కోసం ప్రజలంతా ముప్పుతిప్పలు పడాల్సి వస్తున్నది. నెలల తరబడి ఎమ్మార్వో కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావడం దారుణమైన విషయం. ఇలాంటి ఉదంతమే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి రావడంతో ఆయన సీరియస్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. ఆ ఉదంతం వల్లే.. రెవెన్యూ విభాగాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని సీఎం నిర్ణయించుకున్నారు. ఎవరైనా స్థలం కొన్న తర్వాత.. మ్యుటేషన్ అనేది ఆటోమెటిగ్గా జరిగిపోవాలి. స్థలం కొనుగోలు చేసిన తర్వాత సైతం.. పాస్‌బుక్ అమ్మినవాడి పేరే అందులో ఉంటుంది. రికార్డుల్లో పేరు మార్పిడి అంత సులువుగా పూర్తికావడం లేదు. అందుకే, అధిక శాతం స్థల యజమానులు భూమి అమ్మిన తర్వాత కూడా.. అతని సంబంధీకులు కోర్టుల్లో తప్పుడు కేసులు వేయడానికి ఆస్కారం ఏర్పడుతున్నది. ఇలాంటి కేసుల వల్ల స్థలం కొన్న తర్వాత చాలామంది ఇబ్బందులుపడుతున్నారు. అదే మ్యుటేషన్ ఆటోమెటిగ్గా జరిగిపోతే ఎవరికీ ఎలాంటి సమస్య ఉండదు.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/revenue-department-should-come-in-online-1-2-600802.html